Bharat Biotech: రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సంఖ్యను సగానికి సగం తగ్గించిన భారత్ బయోటెక్

Bharat Biotech cut down Covaxin clinical tests into half
  • వేగంగా మూడో దశ ప్రారంభించేందుకు భారత్ బయోటెక్ నిర్ణయం
  • వలంటీర్ల సంఖ్య 750 నుంచి 380కి తగ్గింపు
  • మూడో దశ ప్రయోగాలకు అనుమతి ఇచ్చిన డీసీజీఐ
ప్రముఖ ఫార్మా పరిశోధన సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ ప్రస్తుతం రెండో దశ క్లినికల్ ట్రయల్స్ జరుపుకుంటోంది. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు వీలుగా భారత్ బయోటెక్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను త్వరగా ముగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను సగానికి సగం తగ్గించనుంది.

వాస్తవానికి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ను 750 మంది వలంటీర్లపై నిర్వహించాల్సి ఉండగా, ఇప్పుడా సంఖ్యను 380కి కుదించారు! వ్యాక్సిన్ ప్రయోగాలు జరిగే ప్రదేశాల సంఖ్యను కూడా తగ్గించారు. కొన్నిరోజుల్లోనే రెండో దశను ముగించి, ఆపై మూడో దశ ప్రయోగాలను వెంటనే చేపట్టాలన్నది భారత్ బయోటెక్ ప్రణాళిక. తద్వారా సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ప్రయోగాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చింది. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటివరకు మెరుగైన ఫలితాలను ఇస్తున్నట్టు తెలుస్తోంది.
Bharat Biotech
COVAXIN
Clinical Tests
India
DCGI

More Telugu News