గుంటూరు జీజీహెచ్‌కి మంత్రి శ్రీరంగనాథరాజు భారీ విరాళం

15-10-2020 Thu 12:41
srirangaraju give one crore to ggh
  • రూ.కోటి విరాళం ప్రకటించిన మంత్రి 
  • జీజీహెచ్‌ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని వ్యాఖ్య
  • రోగులతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజనం

గుంటూరు జీజీహెచ్ కు ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీరంగనాథరాజు  రూ.కోటి విరాళం ప్రకటించారు. పేద ప్రజలకు ఆ ఆసుపత్రి అందిస్తోన్న సేవలను ఆయన కొనియాడారు. జీజీహెచ్‌ 9 జిల్లాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందని, ఆ ఆసుపత్రిలోని రోగులతో పాటు అటెండర్లకు కూడా రెండు పూటల భోజన సదుపాయం కల్పించాలని తాము నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో జీజీహెచ్ అందిస్తోన్న సేవలు ఎనలేనివని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం అందజేస్తున్నానని వివరించారు. జీజీహెచ్ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కరోనా పేషెంట్లకు బెడ్లు అందుబాటులో ఉన్నాయని  శ్రీరంగనాథరాజు చెప్పారు. నూతన భవనాల నిర్మాణం త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కొవిడ్-19 పేషెంట్ల కోసం తగినంత మంది వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని ఆయన వివరించారు.