దసరా తర్వాత రంగంలోకి దిగనున్న 'వకీల్ సాబ్'!

15-10-2020 Thu 09:55
Pawan Kalyan to join Vakeel Saab shoot after Vijaya Dashami
  • ఇటీవలే మొదలైన 'వకీల్ సాబ్' షూట్
  • అంజలి, నివేద థామస్ లపై చిత్రీకరణ
  • దసరాకి సినిమా నుంచి అప్ డేట్  
  • సంక్రాంతికి విడుదల చేసే యత్నాలు  

లాక్ డౌన్ మూలంగా అంతరాయం కలగడంతో ఆగిపోయిన తెలుగు సినిమాల షూటింగులు ఆరు నెలల తర్వాత ఒక్కొక్కటీ మళ్లీ మొదలవుతున్నాయి. ఇప్పటికే కొందరు హైదరాబాదులో షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం యూనిట్ అయితే, ఇటలీకి వెళ్లి మరీ ప్రస్తుతం షూటింగ్ చేస్తోంది.

అలాగే, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగ్ కూడా ఇటీవల హైదరాబాదులో మొదలైంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం అంజలి, నివేద థామస్ తదితరులు పాల్గొంటున్న సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక విజయదశమి పండగ తర్వాత నుంచి పవన్ కల్యాణ్ కూడా ఈ చిత్రం షూటింగులో పాల్గొంటారని తాజా సమాచారం. లాక్ డౌన్ కి ముందే ఆయన షూటింగ్ చాలా పూర్తవడంతో, ఇక కొన్ని రోజులు షూటింగ్ చేస్తే ఆయన పార్ట్ పూర్తవుతుంది.  

ఇదిలావుంచితే, దసరా పండగకి ఈ చిత్రం నుంచి ఒక అప్ డేట్ వస్తుందని అంటున్నారు. మరి అది టీజరా? లేక మరొకటా? అన్నది త్వరలో తెలుస్తుంది. పవన్ చాలా కాలం గ్యాప్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.