కరోనా ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య

15-10-2020 Thu 09:40
Domestic air passenger traffic down 66 percent YoY in Sept
  • సెప్టెంబరులో 39.43 లక్షల మంది ప్రయాణం  
  • జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే కొంత మెరుగు
  • పెరిగిన స్పైస్‌జెట్ మార్కెట్ వాటా

దేశీయ విమానయాన సంస్థలపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో విమాన ప్రయాణాలు ఆగిపోయాయి. ఇటీవల కొన్ని ఆంక్షలతో దేశీయ విమానయాన సంస్థలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ప్రయాణాలు మళ్లీ మొదలయ్యాయి. అయితే, ప్రయాణాలు ప్రారంభమైనా ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సంస్థలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.

సెప్టెంబరులో మొత్తం 39.43 లక్షల మంది మాత్రమే దేశీయ విమానాల్లో ప్రయాణించారు. గతేడాది ఇదే నెలలో 1.1 కోట్ల మంది ప్రయాణించారు. అంటే అప్పటితో పోలిస్తే ఇది 66 శాతం తక్కువని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. అయితే, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య కొంత పెరగడం శుభపరిణామమని పేర్కొంది.

మార్కెట్‌లో అత్యధిక షేర్ కలిగిన ప్రైవేటు విమానయాన సంస్థ ఇండిగో మార్కెట్ షేర్ గతేడాది ఇదే సమయంతో (59.4 శాతం) పోలిస్తే ఈసారి 57.5 శాతానికి పడిపోయింది. స్పైస్‌జెట్ మార్కెట్ షేర్ మాత్రం గతేడాది (13.4 శాతం)తో పోలిస్తే ఈసారి 13.8 శాతానికి పెరిగింది. ఇక ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మార్కెట్ షేర్ గతేడాది ఇదే సమయంలో 9.8 శాతం ఉండగా, ఈసారి అది 9.4 శాతానికి పడిపోయింది.