కారులో మంటలు.. ప్రముఖ వైన్ వ్యాపారి, ఎన్సీపీ నేత సంజయ్ షిండే సజీవదహనం!

15-10-2020 Thu 09:06
NCP Leader Sanjay Shinde died in Fire Accident
  • ముంబై - ఆగ్రా హైవేపై ప్రమాదం
  • కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
  • కారులోనే బూడిదైన సంజయ్ షిండే

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వైన్ వ్యాపారి, ద్రాక్ష ఎగుమతిదారు, ఎన్సీపీ నేత సంజయ్ షిండే, తన కారులోనే సజీవదహనమయ్యారు. ద్రాక్ష తోటల కోసం పురుగు మందులను కొనుగోలు చేసేందుకు పింపాల్ గావ్ కు ఆయన తన కారులో వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు వెల్లడించారు. ముంబై, ఆగ్రా హైవేపై బస్వంత్ టోల్ ప్లాజా సమీపంలో కారులో షార్ట్ సర్క్యూట్ అయిందని తెలిపారు.

కారులో శానిటైజర్ లు ఉండటంతో, మంటలు మరింతగా చెలరేగాయని, ఇదే సమయంలో సెంట్రల్ లాకింగ్ మెకానిజమ్ జామ్ కావడంతో, డోర్లు తీసుకుని ఆయన బయటకు రాలేకపోయారని తెలిపారు. కారు తగులబడి పోవడాన్ని గమనించిన స్థానికులు సమాచారం ఇవ్వగా, ఫైర్ ఇంజన్ వచ్చి, మంటలను ఆర్పిందని, ఆ తరువాతే కారులో ఉన్నది సంజయ్ షిండే అని తెలిసిందని అన్నారు. కాగా, నాసిక్ ప్రాంతంలో సంజయ్ ఎంతో పేరున్న వ్యక్తి. అటు వ్యాపారంలో, ఇటు రాజకీయాల్లోనూ రాణించారు. సంజయ్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.