Talasani: నష్టం జరిగిన మాట నిజమే కానీ... 'హైదరాబాద్ అతలాకుతలం' అనడం మాత్రం సరికాదు: మంత్రి తలసాని

  • నాలాల కబ్జాలకు కారణం ఎవరో అందరికీ తెలిసిందే
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం
  • జీహెచ్ఎంసీ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్న తలసాని
Talasani Qrgueddont say Situation Worsen in Hyderabad

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లో కొంత మేరకు నష్టం జరిగిన మాట వాస్తవమేనని, ఇదే సమయంలో నగరం అతలాకుతలమైందని, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని వ్యాఖ్యానించడం సరికాదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు.

ఓ టీవీ చానెల్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, హైదరాబాద్ లో నాలాల కబ్జాలకు కారణం ఎవరన్న విషయం అందరికీ తెలిసిందేనని, తాను రాజకీయాలు మాట్లాడాలని భావించడం లేదని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగు నిర్ణయాలు తీసుకుంటున్నామని అన్నారు.

నగరానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, నగరం చుట్టుపక్కలా ఉన్న జలాశయాలు ఇప్పటికే నిండిపోవడం, గతంలో ఎన్నడూ లేనంత భారీ వర్షం కురవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, ఇప్పటికే తమ ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులను ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేసిన తలసాని, ఎక్కడ ఎటువంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించేందుకు జీహెచ్ఎంసీ టీమ్ లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

వర్షం విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలు అర్థరహితమని, నీరు నిలిచిన ప్రాంతాల నుంచి నీటిని బయటకు పంపించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నామని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు రాకుండా చూసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని తెలిపారు. ఇవి ఊహించని వరదలని, ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.

More Telugu News