ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 వరకు పండుగ ప్రత్యేక రైళ్లు.. వివరాలు ఇవిగో!

15-10-2020 Thu 08:50
Festival special trains commins from october 20
  • దసరా, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
  • తిరుపతి, నర్సాపూర్, మహారాష్ట్రలోని అమరావతి మధ్య ప్రతి రోజూ సర్వీసులు
  • కొన్ని వరంగల్, మరికొన్ని నడికుడి రూట్లో ప్రయాణం

దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ప్రత్యేక రైళ్లు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 వరకు నడవనున్నాయి. కాకినాడ, తిరుపతి, నర్సాపూర్, మహారాష్ట్రలోని అమరావతి మధ్య సేవలు అందించనున్నాయి.

లింగంపల్లి–కాకినాడ పోర్ట్‌ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ లింగంపల్లిలో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.20 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. కాకినాడలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6.05 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు వయా వరంగల్ మీదుగా ప్రయాణించనున్నాయి.

లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్లే రైలు సాయంత్రం 5.30 గంటలకు లింగంపల్లి స్టేషన్‌లో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 6 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతిలో సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు లింగంపల్లి చేరుకుంటుందని, ఇవి బీబీనగర్, నడికుడి రూట్లో ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. లింగంపల్లి-కాకినాడ, లింగంపల్లి-తిరుపతి రైళ్లు ఈ నెల 20 నుంచి సేవలు ప్రారంభించనున్నాయి.

ఇక లింగంపల్లి-నర్సాపూర్ మధ్య ఈ నెల 23 నుంచి నవంబరు 30 వరకు ప్రతి రోజూ రైలు నడవనుంది. లింగంపల్లిలో రాత్రి 9.05 గంటలకు బయలుదేరి ఆ తర్వాతి రోజు 7.45కు నర్సాపూర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్‌లో సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50కి లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి.

అలాగే, తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అమరాతి మధ్య ఈ నెల 22 నుంచి ప్రతి రోజూ రైళ్లు నడవనున్నాయి. తిరుపతిలో మధ్యాహ్నం 3.10 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు మధ్యాహ్నం 2.50 గంటలకు అమరావతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అమరావతిలో ఉదయం 6.45కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైళ్లు పాకాల, మహబూబ్‌నగర్, నిజామాబాద్ మీదుగా ప్రయాణం సాగించనున్నాయి.