కరోనా బారినపడిన ములాయం సింగ్ యాదవ్.. ఆరోగ్యం నిలకడగా ఉందన్న అఖిలేశ్

15-10-2020 Thu 07:08
Samajwadi party leader Mulayam tested corona positive
  • గురుగ్రామ్‌లోని మేదాంతలో చేరిన ములాయం
  • ఒక్క లక్షణం కూడా లేదన్న పార్టీ
  • ములాయం భార్యకు కూడా సోకిన మహమ్మారి!

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కరోనాకు సంబంధించి ములాయంలో ఒక్కటంటే ఒక్క లక్షణం కూడా లేదని సమాజ్‌వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్‌ ద్వారా తెలిపింది. ములాయం భార్యకు కూడా కరోనా సంక్రమించినట్టు తెలుస్తోంది. ములాయం ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ స్పందించారు.

ములాయం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు చెప్పారు. ములాయం ఆగస్టులో కడుపు నొప్పి, మూత్ర సంబంధిత సమస్యలతో లక్నోలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. చాలా రోజుల చికిత్స అనంతరం ఆయన కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు కరోనా కారణంగా మరోమారు ఆసుపత్రిలో చేరారు.