ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్

14-10-2020 Wed 21:33
Petition filed in Supreme Court to remove Jagan as CM
  • జగన్ పై 30కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయన్న పిటిషనర్లు
  • న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తున్నారని పేర్కొన్న వైనం
  • ఓ కుట్ర ప్రకారం చేస్తున్నారని ఆరోపణ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ వేశారు.

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణపై తప్పుడు ఆరోపణలు చేస్తూ లేఖ రాశారంటూ తమ పిటిషన్ లో పేర్కొన్నారు. జగన్ పై దాదాపు 30 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని... అలాంటి వ్యక్తి న్యాయ వ్యవస్థను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. మనీలాండరింగ్ కేసులను కూడా జగన్ ఎదుర్కొంటున్నారని చెప్పారు.

సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్ లో ఆరోపించారు. అంతా ఓ కుట్ర ప్రకారం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని కోరారు. తక్షణమే సీఎం పదవి నుంచి జగన్ ను తొలగించాలని విన్నవించారు.