హైదరాబాద్ లో మెట్రోరైల్ స్టేషన్ పిల్లర్ వద్ద కుంగిన రోడ్డు

14-10-2020 Wed 18:08
Road sinks near Hyderabad metro station
  • మూసాపేట్ మెట్రో స్టేషన్ వద్ద కుంగిన రోడ్డు
  • బ్యారికేడ్లను ఏర్పాటు చేసిన మెట్రో సిబ్బంది
  • భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు

హైదరాబాదులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరం మొత్తం జలమయం అయింది. ఈ నేపథ్యంలో కూకట్ పల్లి సమీపంలో ఉన్న మూసాపేట్ మెట్రోరైల్ స్టేషన్ పిల్లర్ వద్ద రోడ్డు కుంగింది. ఈ ఘటనతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్న మెట్రో సిబ్బంది బ్యారికేడ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ప్రమాదం వాటిల్లకుండా ఏర్పాట్లు చేశారు.

దీనిపై మెట్రో అధికారులు స్పందిస్తూ... గతంలో రోడ్డును తవ్వి, అక్కడ మళ్లీ వేశారని... ఆ ప్రాంతంలోనే రోడ్డు కుంగిపోయిందని చెప్పారు. మెట్రో ట్రాక్ కోసం వేసిన పిల్లర్ చాలా లోతు నుంచి వేసిందని... రోడ్డు కుంగడం వల్ల పిల్లర్ కు నష్టం ఉండదని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.