ప్రభాస్ సినిమాకు అమితాబ్ కు అంత ఇస్తున్నారా?

14-10-2020 Wed 16:51
Amitab paid a bomb for Prabhas film
  • ప్రభాస్ హీరోగా వైజయంతీ మూవీస్ చిత్రం 
  • కథానాయికగా దీపిక.. కీలక పాత్రలో అమితాబ్
  • అమితాబ్, దీపికలకు చెరో పాతిక కోట్లు      

వైజయంతీ మూవీస్ అంటేనే భారీ చిత్రాల నిర్మాణ సంస్థ. దానికి తోడు పెద్ద పెద్ద కాంబినేషన్లను సెట్ చేసే సంస్థ. గతంలో అలాంటి భారీ కాంబినేషన్లతో.. భారీ చిత్రాలను నిర్మించిన ట్రాక్ రికార్డు ఆ సంస్థకు ఎంతో వుంది. ఇప్పుడు ఇదే కోవలో ప్రభాస్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం కూడా చేరుతోంది.  

'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సంస్థ ప్రభాస్ తో నిర్మిస్తున్న చిత్రం అనేక ప్రత్యేకతలను సంతరించుకుంది. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. బాలీవుడ్ బిజీ కథానాయిక దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. ఆమెకు సుమారు పాతిక కోట్ల పారితోషికాన్ని ఇచ్చి బుక్ చేసినట్టు వార్తలొచ్చాయి.

ఇక తాజాగా మరో కీలక పాత్రకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ని ఎంచుకున్న సంగతి విదితమే. ఈ చిత్రం కోసం అమితాబ్ 40 రోజుల కాల్ షీట్స్ ఇచ్చారట. దానిని బట్టి చిత్రంలో ఆయన పాత్రకున్న ప్రాధాన్యత మనకు తెలుస్తుంది.

అలాగే, అమితాబ్ కు 25 కోట్ల రూపాయల పారితోషికాన్ని ఇస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ఫిలిం నగర్లో ఒక సెన్సేషన్ కూడా అయింది. ఇలా కేవలం అమితాబ్, దీపికలకే 50 కోట్ల వరకు పారితోషికాల రూపంలో చెల్లిస్తుంటే, ఇక ఈ సినిమా బడ్జెట్ ఏ రేంజిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు!