జగన్ లేఖపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ సీరియస్!

14-10-2020 Wed 16:31
Delhi High Court Bar Association serious on Jagan letter to CJI
  • జగన్ లేఖను ముక్త కంఠంతో ఖండిస్తున్నాం
  • కోర్టుల స్వతంత్రతను దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారు
  • ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది

ఏపీ హైకోర్టును సుప్రీంకోర్డు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకు సీఎం జగన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం మీడియా ముఖంగా వెల్లడించిన వెంటనే కలకలం రేగింది. మరోవైపు జగన్ లేఖను ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్ట్ అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ తప్పుపట్టాయి.

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల తీర్పులకు ఉద్దేశాలను ఆపాదించేలా జగన్ ప్రవర్తించారని విమర్శించాయి. జగన్ లేఖను ముక్తకంఠంతో ఖండిస్తున్నామని తెలిపాయి. జగన్ చర్యలు న్యాయ వ్యవస్థకు మచ్చ తెచ్చేలా ఉన్నాయని మండిపడ్డాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా న్యాయమూర్తులపై, న్యాయవ్యవస్థపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నాయి. జస్టిస్ రమణ ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి అని కితాబునిచ్చాయి.

కోర్టుల స్వతంత్రతను దెబ్బదీసేలా జగన్ వ్యవహరించారని మండిపడ్డాయి. కోర్టులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా జగన్ రాసిన లేఖ ఉందని చెప్పాయి. న్యాయవ్యవస్థ పాలనా వ్యవహారాల్లో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్టుగా తాము భావిస్తున్నామని తెలిపాయి. ఒక ప్రెస్ మీట్ ద్వారా ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడటం అత్యంత దారుణమని అన్నాయి. జగన్ చర్య కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొన్నాయి.