శోభానాయుడు మృతిపై కేసీఆర్, జగన్, చంద్రబాబు సంతాపం!

14-10-2020 Wed 14:02
KCR Jagan Chandrababu pays tributes to eminent dancer Shobha Naidu
  • శోభానాయుడి లోటు తీర్చలేనిదన్న కేసీఆర్
  • ప్రపంచాన్ని అలరించారన్న జగన్
  • కళామతల్లి తన ముద్దుబిడ్డను కోల్పోయిందన్న చంద్రబాబు

ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి శోభానాయుడు మృతితో రాజకీయ, సినీ, కళా రంగాలకు చెందిన ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తమ సంతాపాన్ని ప్రకటించారు.

'సత్యభామ, పద్మావతి పాత్రలను తన కూచిపూడి నృత్యం ద్వారా అద్భుతంగా పోషించారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అని కేసీఆర్ ట్వీట్ చేశారు.

అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు తన అద్భుతమైన నాట్యంతో ప్రపంచాన్ని అలరించారని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొనియాడారు. ఆమె కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

భారతీయ కళల కీర్తిప్రతిష్టలను దేశవిదేశాల్లో తన నాట్య ప్రతిభతో శోభానాయుడు పెంచారని చంద్రబాబు అన్నారు. ఆమె వల్ల కూచిపూడి నాట్యానికి అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు ఇనుమడించాయని చెప్పారు. ఆమె సాధించిన అవార్డులు, రివార్డులే ఆమె కళా ప్రతిభకు తార్కాణాలని అన్నారు. తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డను కోల్పోయిందని చెప్పారు. ఆమె కుటుబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.