జరిమానా విధించాల్సి ఉంటుంది: రజనీకాంత్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

14-10-2020 Wed 13:42
Madras HC warns Super Star Rajinikanth
  • కల్యాణమంటపానికి ఆస్తి పన్ను చెల్లించాలని రజనీకి కార్పొరేషన్ నోటీసులు
  • కరోనా వల్ల కల్యాణమంటపం తెరవలేదని రజనీ పిటిషన్
  • పన్నును తాను చెల్లించలేనన్న రజనీ

ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళ్తే, చెన్నైలో తనకు ఉన్న రాఘవేంద్ర కల్యాణమంటపంపై రూ. 6.5 లక్షల ఆస్తి పన్ను చెల్లించాలంటూ రజనీకాంత్ కు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ నోటీసులు పంపించింది.

ఈ నోటీసులపై మద్రాస్ హైకోర్టును రజనీకాంత్ ఆశ్రయించారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో మార్చి 24 నుంచి కల్యాణమంటపాన్ని మూసి ఉంచామని... అప్పటి నుంచి దాన్నుంచి తనకు ఎలాంటి ఆదాయం లేదని, కార్పొరేషన్ విధించిన పన్నును తాను చెల్లించలేనని పిటిషన్ లో రజనీ పేర్కొన్నారు.

ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అనిత సుమంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, రజనీ తరపు లాయర్ మాట్లాడుతూ కేసును విత్ డ్రా చేసుకోవడానికి తమకు కొంత సమయం కావాలని కోర్టును కోరారు.