స్వామి చిన్మయానంద కేసులో కీలక మలుపు.. లైంగిక దాడి చేయలేదన్న విద్యార్థిని.. కేసు నమోదు చేయాలన్న కోర్టు

14-10-2020 Wed 12:58
Student Who Accused Chinmayanand Of Rape takes U turn
  • విద్యార్థిని ఫిర్యాదుతో చిన్మయానంద అరెస్ట్
  • తనపై ఆయన లైంగికదాడికి పాల్పడలేదని కోర్టుకు తెలిపిన విద్యార్థిని
  • ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు

కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతేడాది ఆరోపించిన లా విద్యార్థిని తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని స్పష్టం చేసింది. చిన్మయానందపై లా విద్యార్థిని వేసిన కేసుతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లక్నోలోని ప్రత్యేక కోర్టు ఈ కేసును విచారిస్తోంది.

నిన్న ఈ కేసు విచారణకు రాగా, చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని విద్యార్థిని కోర్టుకు తెలిపింది. మాజీ మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతంలో ఆరోపించిన విద్యార్థిని తాజాగా మాట మార్చడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.