బైడెన్ గెలిచాడే అనుకోండి.. మీరిక ఉద్యోగాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే: అమెరికన్లకు ట్రంప్ హెచ్చరిక

14-10-2020 Wed 12:41
donald trump slams his rival joe biden in election rally
  • బైడెన్‌కు లొంగిపోవడం వెన్నతో పెట్టిన విద్య
  • చైనా, వామపక్షాలు బైడెన్ గెలుపును అందుకే కోరుకుంటున్నాయి
  • నన్ను గెలిపిస్తే  వచ్చే నాలుగేళ్లలో సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతా

అధ్యక్ష ఎన్నికల్లో తనకు ప్రత్యర్థిగా నిలిచిన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా నుంచి పూర్తిగా బయటపడిన అనంతరం నిన్న పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ప్రత్యర్థి బైడెన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆయనే కనుక గెలిస్తే అమెరికన్లు ఇక ఉద్యోగాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని హెచ్చరించారు.

బైడెన్‌కు లొంగిపోవడం కొత్తకాదని, ఆయన గెలిస్తే చైనాకు లొంగిపోయి, మన ఉద్యోగాలను వారికి అప్పగించేస్తారని ఆరోపించారు. చైనాతోపాటు వామపక్షాలు కూడా బైడెన్ విజయాన్ని కాంక్షించడం వెనక ఉన్న కారణం ఇదేనని ట్రంప్ అన్నారు. అంతేకాదు, బైడెన్ చాలా సులువుగా లొంగిపోతారని, అది చైనా అయినా, క్యూబా అయినా లొంగిపోవడం అనేది ఆయనలోని లక్షణమని ట్రంప్ ఎద్దేవా చేశారు.

క్యూబాతో ఆయన చేసుకున్న ఒప్పందం గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఆ ఒప్పందం ఎంత చెడ్డదో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఆయన గెలిస్తే చైనాపై సుంకాలను తొలగిస్తారని ఆరోపించారు.  ఈ ఉద్దేశంతోనే చైనా ఆయన విజయాన్ని కోరుకుంటుందని అన్నారు. బైడెన్ గెలిస్తే అమెరికా చైనా పరమవుతుందని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో తనను మరోమారు గెలిపిస్తే వచ్చే నాలుగేళ్లలో అమెరికాను ఉత్పాదక రంగంలో ప్రపంచంలో సూపర్ పవర్‌గా నిలుపుతానని హామీ ఇచ్చారు.