హైదరాబాద్ సమీపంలో తీవ్ర వాయుగుండం.. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

14-10-2020 Wed 12:02
deep depression on Hyderabad heavy rains expected
  • నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
  • రాగల 12 గంటల్లో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటున్న జీహెచ్ఎంసీ అధికారులు

భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్‌ వాసులకు మరో హెచ్చరికే ఇది. నగరానికి పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు తెలిపారు. వచ్చే 12 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలహీనపడుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో నేడు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇక, నిన్నటి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ వాసులను తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లపైకి నడుములోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.