నేను అందుకే పెదవి విప్పాల్సి వచ్చింది: ఖుష్బూ

14-10-2020 Wed 10:32
Actress Kushboo Sensational Comments on Congress Leaders
  • ఇటీవల నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన ఖుష్బూ
  • చెన్నైలో ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • కాంగ్రెస్ ను విమర్శించరాదనే అనుకున్నా
  • వారు వదిలిపెట్టడం లేదని వ్యాఖ్య

తాను డీఎంకే పార్టీని వీడిన సమయంలో, ఆ పార్టీపై ఎటువంటి విమర్శలూ చేయలేదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు కూడా అదే విధంగా ఉండాలని భావించానని, అయితే, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం తనను వదిలిపెట్టకపోవడంతోనే పెదవి విప్పాల్సి వచ్చిందని ఇటీవల బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు.

 కాంగ్రెస్ పార్టీలో మానసిక ఎదుగుదల లేదని, పార్టీ నేతలకు అసలు బుర్రే లేదని ఎద్దేవా చేసిన ఆమె, తన సేవలను వాడుకున్నవేళ, తాను నటినన్న సంగతి ఇప్పుడు విమర్శిస్తున్న వారికి తెలియదా? అంటూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్న ఆమె, నిన్న చెన్నైకి తిరిగి రాగా, పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్ ఆమెను సత్కరించి, అక్కడి నుంచి నేరుగా కమలాలయానికి తీసుకుని వెళ్లగా, ఖుష్బూ మీడియాతో మాట్లాడారు.

తనను ఎవరైనా విమర్శిస్తే, ఎదురు దాడి చేసేందుకు వెనుకాడబోనని స్పష్టం చేసిన ఆమె, కాంగ్రెస్ పార్టీలో తాను ఎదగకుండా అణగదొక్కారని నిప్పులు చెరిగారు. తాను తెలివైన దాన్ని కాబట్టే, తొందరగా మేల్కొని, కాంగ్రెస్ ను వీడానని, గతంలో ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టే, అధికార పక్షాన్ని వ్యతిరేకించానని అన్నారు.

తాను బీజేపీలో చేరడానికి తన భర్త సుందర్ కారణం కాదని ఖుష్బూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను వీడిన తరువాత, తనకు చాలా ఆనందంగా అనిపించిందని తెలిపారు. కాగా, ఖుష్బూ చేరికతో తమిళనాడు బీజేపీలో సినీ గ్లామర్ మరింతగా పెరిగింది. ఇప్పటికే గౌతమి, నమిత, గాయత్రి, రఘురాం, కుట్టి పద్మిని, రాధారవి, దీనా, మధువంతి తదితరులు బీజేపీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.