సినీనటి ప్రణీత పేరుతో కంపెనీ యజమానిని రూ. 13.50 లక్షల మేర ముంచిన ముఠా

14-10-2020 Wed 10:27
frauds in the name of actress praneeth
  • బెంగళూరులో ఘటన
  • ప్రణీత మేనేజర్‌నంటూ కంపెనీ చైర్మన్‌తో పరిచయం
  • నటిని కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తానంటూ మోసం

ప్రముఖ సినీ నటి ప్రణీత పేరుతో ఓ ముఠా చెలరేగిపోయింది. ఓ కంపెనీ యజమానిని రూ. 13.50 లక్షల మేర మోసం చేసింది. బెంగళూరులో జరిగిందీ ఘటన. ఈ నెల 6న చెన్నైకి చెందిన కొందరు వ్యక్తుల ముఠా బెంగళూరు వచ్చింది. అక్కడి ఓ హోటల్‌లో ఎస్‌వీ గ్రూప్ అండ్ డెవలపర్స్ కంపెనీ చైర్మన్ అమరనాథ్‌రెడ్డిని ఈ ముఠా కలిసింది. ముఠాలోని వర్ష అనే యువతి తాను ప్రణీత మేనేజర్‌నని అమరనాథ్‌రెడ్డిని నమ్మబలికింది.

ఎస్‌వీ గ్రూప్‌నకు ప్రచారకర్తగా ప్రణీతను కుదురుస్తామని, త్వరలోనే అగ్రిమెంట్ చేయిస్తానని చెప్పడంతో అమరనాథ్‌రెడ్డి సరేనన్నారు. ఒప్పందంలో భాగంగా ఆయన వారికి రూ.13.50 లక్షలు చెల్లించారు. డబ్బులు తీసుకుని వెళ్లిన తర్వాత ముఠా నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని భావించిన అమరనాథ్‌రెడ్డి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.