Mehbooba Mufti: ఆ అవమానాన్ని మేము మర్చిపోలేము: మెహబూబా ముఫ్తీ

  • ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో ఆగస్టు 5న హౌస్ అరెస్టు చేశారు
  • ఆర్టికల్‌ 370ని చట్ట విరుద్ధంగా రద్దు చేశారు
  • దాన్ని తిరిగి సాధిస్తాము
  • పొరాటాన్ని కొనసాగిస్తాం 
mifti fires on govt

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టు 5 నుంచి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీతో పాటు పలువురిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 14 నెలల పాటు నిర్బంధంలో ఉన్న ఆమె నిన్న రాత్రి విడుదలయ్యారు.

ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ... ఆగస్టు 5న జరిగిన అవమానాన్ని తమలో ఎవరూ మర్చిపోలేరని చెప్పుకొచ్చారు.  ఆర్టికల్‌ 370ని చట్ట విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. దాన్ని తిరిగి సాధిస్తామని, అలాగే కశ్మీర్‌ సమస్యను కూడా పరిష్కరించాలని ఆమె అన్నారు. అందుకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, ఈ మార్గం సులభం కాదని తమకు తెలుసని, అయినప్పటికీ పొరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

తనను విడిచిపెట్టినప్పటికీ, ఇప్పటికీ చాలా మంది చట్ట విరుద్ధంగా నిర్బంధంలో ఉన్నారని ఆమె తెలిపారు. వారందరిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ముఫ్తీని కొంత కాలం పాటు చెష్మా షాహి అతిథి గృహంలో, అనంతరం ఎంఏ లింక్‌ రోడ్డులోని మరో అతిథి గృహంలో నిర్బంధంలో ఉంచారు.

More Telugu News