ఎవరేమన్నా, ఏమనుకున్నా... ధోనీ టీ-20 కింగేనట!

14-10-2020 Wed 07:48
MSD is t 20 King
  • సర్వే నిర్వహించిన స్పోర్ట్స్ ఫ్లాష్
  • కోహ్లీ కన్నా ధోనీకే అధిక ఓట్లు
  • ధోనీపై అభిమానుల నమ్మకం

పొట్టి క్రికెట్ లో రారాజు ఎవరు? ఇదే ప్రశ్నను అడిగితే, గత సంవత్సరం వరకూ వచ్చే సమాధానం ఒక్కటే... అదే మహేంద్ర సింగ్ ధోనీ. కానీ ఆ తరువాత పరిస్థితి కాస్తంత మారిపోయింది. ధోనీ ఆటకు దూరమయ్యాడు. గత సంవత్సరం జరిగిన వరల్డ్ కప్ తరువాత, మరోసారి ఆయన బ్యాట్ ను పట్టుకోలేదు. అయితేనేం... ఇప్పటికీ కోట్లాది మంది ధోనీపై తమకున్న అభిమానాన్ని ఏ మాత్రమూ తగ్గించుకోలేదని తేలింది. ఈ ఐపీఎల్ సీజన్ లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత వరుస ఓటములతో అవస్థలు పడినా, ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నట్టు కనిపిస్తోంది. 

తాజాగా ఆన్ లైన్ స్పోర్ట్స్ చానెల్ 'స్పోర్ట్స్ ఫ్లాష్' ఓ సర్వేను నిర్వహిస్తూ, టీ-20 కింగ్ ఎవరు అని వివిధ సామాజిక మాధ్యమాల్లో ఓటింగ్ ను నిర్వహించింది. ఇందుకోసం తొలుత నలుగురు ఆటగాళ్లను ఎంపిక చేయగా, అందులో యువరాజ్, ధోనీ, రోహిత్ శర్మ, కోహ్లీ నిలిచారు. ఆపై సెమీ ఫైనల్ పోటీలో యువరాజ్ పై ధోనీ, రోహిత్ పై కోహ్లీ గెలువగా, ఫైనల్ లో కోహ్లీపై ధోనీ గెలిచాడు.