హైదరాబాద్ అతలాకుతలం... నిన్నటి నుంచి ఎడతెరిపిలేని వాన!

14-10-2020 Wed 06:50
Very Heavy Rain in Hyderabad
  • నిన్న ఉదయం నుంచి వర్షం
  • రాత్రంతా కుంభవృష్టి
  • నీట మునిగిన పలు ప్రాంతాలు

మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న చిరు జల్లులు, రాత్రికి భారీ వర్షంగా, కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా మారి, తెల్లార్లూ కురుస్తూనే ఉండటంతో హైదరాబాద్ మహానగరం అస్తవ్యస్తమైంది. ఉత్తర కోస్తా ప్రాంతంలో తీరం దాటిన వాయుగుండం, విజయనగరం, తూర్పు గోదావరి, విశాఖపట్నం, ఉమ్మడి ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల మీదుగా ప్రయాణించడమే ఇందుకు కారణం.

హైదరాబాద్ లో పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఎప్పుడూ వరద నీరు రాని ప్రాంతాలు కూడా ముంపునకు గురయ్యాయి. వందలాది అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరగా, వేలాది వాహనాలు ధ్వంసమయ్యాయి. అన్ని నాలాలూ నిండుగా ప్రవహిస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లపైకి రెండు నుంచి మూడు అడుగుల మేరకు నీరు ప్రవహిస్తోంది. ముఖ్యంగా ఎల్బీ నగర్, దిల్ సుఖ్ నగర్, మూసారం బాగ్, మలక్ పేట, కోటి, చాంద్రాయణగుట్ట, లంగర్ హౌస్, మెహిదీపట్నం, పంజాగుట్ట, అమీర్ పేట, కూకట్ పల్లి, మాదాపూర్, తార్నాక, మల్కాజ్ గిరి తరితర ప్రాంతాల్లో పరిస్థితి భీతావహంగా మారింది.

రాత్రంతా చాలా ప్రాంతాల్లో విద్యుత్ లేకపోవడంతో ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. విద్యుత్ సబ్ స్టేషన్లలోకి వరద నీరురావడంతోనే ముందు జాగ్రత్తగా కరెంట్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాత్రి 2 గంటల నుంచి వర్షం కాస్తంత తగ్గడంతో ప్రాంతాల వారీగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్టు వెల్లడించారు.