యంగ్ హీరోతో కొరటాల శివ తదుపరి సినిమా?

13-10-2020 Tue 21:47
Koratala Shiva to direct young hero
  • చిరంజీవితో 'ఆచార్య' చేస్తున్న కొరటాల  
  • ఇప్పటికే సగం పూర్తయిన ఆచార్య
  • తదుపరి చిత్రంగా చిన్న బడ్జెట్ చిత్రం
  • అవకాశం దక్కించుకోనున్న నవీన్ పోలిశెట్టి?

ప్రస్తుత టాలీవుడ్ అగ్రదర్శకులలో కొరటాల శివ ఒకరు. సోషల్ మెసేజ్ ని వినోదంతో రంగరించి సినిమాలు రూపొందించడంలో ఆయన దిట్ట. ఆయన ఇంతవరకు చేసిన సినిమాలన్నీ హిట్లే. అందుకే, ఆయనతో ఓ సినిమా అయినా చేయాలని స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతూ వుంటారు.

ప్రస్తుతం ఆయన చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. లాక్ డౌన్ కి ముందు మొదలైన ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. త్వరలో ఈ చిత్రం మిగతా షూటింగును కూడా పూర్తి చేసే పనిలో దర్శకుడు శివ వున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం చేస్తారంటూ ఆమధ్య వార్తలొచ్చాయి. అయితే, అందుకు ఇంకా సమయం ఉండడంతో ఈ లోగా ఓ చిన్న చిత్రాన్ని చేయాలని శివ ఆలోచిస్తున్నారట.

ఈ క్రమంలో దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా ఈ లాక్ డౌన్ సమయంలో శివ పూర్తిచేసుకున్నారని అంటున్నారు. ఇక ఇందులో హీరోగా నటించే ఛాన్స్ యువ హీరో నవీన్ పోలిశెట్టికి దక్కనున్నట్టు తాజా సమాచారం. 'ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం ద్వారా పేరుతెచ్చుకున్న నవీన్ కు కొరటాల శివ సినిమాలో నటించే అవకాశం వస్తే కనుక చాలా లక్కీ అనే చెప్పుకోవచ్చు!