IMD: ఏపీలో ఈ ఐదు జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసిన ఐఎండీ

IMD issues heavy to heavy rain alert for five districts in AP
  • ఈ ఉదయం తీరం దాటిన వాయుగుండం
  • భారీవర్షాలకు ఉత్తరాంధ్ర అతలాకుతలం
  • అప్రమత్తమైన యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో తీరం దాటింది. వాయుగుండం భూభాగంపైకి ప్రవేశించిన తర్వాత దాని ప్రభావం పలు జిల్లాలపై విస్తృతస్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర అతి భారీ వర్షాలతో అతలాకుతలమైంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి.

ఈ నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఏపీలోని ఐదు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలకు అతి భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

కాగా, తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో అత్యధికంగా 243 మిమీ వర్షపాతం నమోదైంది. రాయవరం మండలంలో 228 మిమీ, రామచంద్రాపురం మండలంలో 207 మిమీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో 11 గ్రామాలు బాగా దెబ్బతిన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 40 గ్రామాలపై వాయుగుండం ప్రభావం అధికంగా కనిపించింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. ఐఎండీ వర్ష సూచనతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
IMD
Andhra Pradesh
Rains
Depression
Bay Of Bengal

More Telugu News