వైఎస్సార్ ఒకడుగు ముందుకేస్తే సీఎం జగన్ రెండడుగులు ముందుకేశారు: రోజా

13-10-2020 Tue 16:53
MLA Roja heaps praise on CM Jagan
  • ప్రజారోగ్యంపై సీఎం జగన్ ఎంతో శ్రద్ధ చూపుతున్నారన్న రోజా
  • కొత్త అంబులెన్స్ లు తెచ్చారని వెల్లడి
  • సీఎం జగన్ దేశానికే ఆదర్శం అంటూ వ్యాఖ్యలు

నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సీఎం జగన్ ను మరోసారి కొనియాడారు. ప్రజల ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ ఎంతో శద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. వైద్య ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువచ్చారని వెల్లడించారు. గత ప్రభుత్వం 108, 104 అంబులెన్స్ లను నిర్లక్ష్యం చేస్తే సీఎం జగన్ కొత్త వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజలకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పిస్తున్నారని వివరించారు.

ప్రజారోగ్యం విషయంలో వైఎస్సార్ ఒకడుగు వేస్తే సీఎం జగన్ రెండడుగులు వేస్తున్నారని కితాబిచ్చారు. అంతేకాకుండా, సీఎం జగన్ కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలిచారని రోజా ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా ఏపీ అత్యధికంగా కరోనా టెస్టులు చేసిందంటే అందుకు కారణం సీఎం జగన్ పాలనా విధానాలేనని అన్నారు.