ashwini dutt: అశ్వనీదత్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ

  • విమానాశ్రయ విస్తరణకు భూములిచ్చిన అశ్వనీదత్
  • ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో తనకు తీరని నష్టం వాటిల్లిందని పిటిషన్
  • రూ. 210 కోట్ల పరిహారం ఇప్పించాలన్న అశ్వనీదత్
AP HC hears the petition of Ashwini Dutt

విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణ కోసం తాను ఇచ్చిన భూముల విషయంలో నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుతూ సినీ నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ఏపీ హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ రోజు ఈ కేసు విచారణకు వచ్చింది.

అశ్వనీదత్ తరపున ప్రముఖ లాయర్ జంధ్యాల రవిశంకర్ హైకోర్టులో వాదనలు వినిపించారు. అశ్వనీదత్ కు ఏడాదిగా ప్రభుత్వం లీజును కూడా చెల్లించలేదని రవిశంకర్ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వైఖరితో అశ్వనీదత్ ఎంతో నష్టపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫైనల్ కౌంటర్లను దాఖలు చేయాలని రెవెన్యూ, మున్సిపల్, సీఆర్డీయేలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 3కి వాయిదా వేసింది.

గత ప్రభుత్వ హయాంలో సుమారు 40 ఎకరాల భూమిని విమానాశ్రయ విస్తరణ కోసం అశ్వనీదత్ ఇచ్చారు. దీనికి బదులుగా అమరావతిలో ఆయనకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని మార్చాలనుకోవడంతో తనకు తీరని నష్టం వాటిల్లిందని... ప్రభుత్వం నుంచి రూ. 210 కోట్ల పరిహారాన్ని వెంటనే ఇప్పించాలని హైకోర్టును అశ్వనీదత్ ఆశ్రయించారు.

More Telugu News