Khushboo: నేను అందగత్తెనే కాదు తెగువ ఉన్నదాన్ని కూడా: ఖుష్బూ

Khushboo describes herself bold and beautiful
  • కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఖుష్బూ
  • కాంగ్రెస్ మారిపోయిందని వ్యాఖ్యలు
  • అళగిరి కంటే తనకు జనాకర్షక శక్తి ఎక్కువని వెల్లడి
సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరడం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఖుష్బూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

 కాంగ్రెస్ నుంచి తప్పుకోవడానికి కారణం ఆ పార్టీ నడుస్తున్న తీరు సరిగా లేకపోవడమేనని అన్నారు. 'కాంగ్రెస్ పార్టీ మారిపోయింది, ఆ పార్టీలో నేతలు మారిపోయారు' అని వ్యాఖ్యానించారు. అంతకుమించి తన నిష్క్రమణకు గల కారణాలను వివరించలేనని తెలిపారు.

నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు తనకు బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోందని, కానీ గత నాలుగేళ్లుగా స్థానిక నేతలు తనతో ఎలా ప్రవర్తిస్తున్నదీ చెబుతూనే ఉన్నానని, దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వివరించారు. జ్యోతిరాదిత్య సింథియా వెళ్లిపోయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాగే చెప్పిందని అన్నారు.

ఇక తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి తనను తామరాకుపై నీటిబొట్టు అని అభివర్ణించడం పట్ల ఖుష్బూ స్పందించారు. ఇలాంటి స్త్రీద్వేష వ్యాఖ్యల గురించే తాను మొదట్నించి చెబుతున్నానని స్పష్టం చేశారు.

"నేను ఓ నటినే కావచ్చు. కానీ అళగిరి ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తి. నేను ప్రజలను ఆకర్షించగలను. అళగిరి నాలా జనాకర్షక శక్తి ఉన్న వ్యక్తి కాదు. అందుకే, తమకంటే తెలివైన, వాక్పటిమ ఉన్న మహిళను ఈ విధంగా ఎదుర్కోవాలని ప్రయత్నించారు. విధేయత గురించి మాట్లాడడం ఇక వృథా. నాది గట్టి గుండె. నేను అందగత్తెనే కాదు, తెగువ ఉన్నదాన్ని కూడా" అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
Khushboo
Bold and Beautiful
Daring
BJP
Congress
Azhagiri
Tamilnadu

More Telugu News