సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ కన్నుమూత

13-10-2020 Tue 15:58
CPI senior leader Gunda Mallesh dies of illness
  • అనారోగ్యంతో బాధపడుతున్న గుండా మల్లేశ్
  • నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి
  • బెల్లంపల్లిలో అంత్యక్రియలు

తెలుగు రాష్ట్రాల సీపీఐ వర్గాల్లో విషాదం చోటుచేసుకుంది. సీపీఐ సీనియర్ నాయకుడు గుండా మల్లేశ్ అనారోగ్యంతో మరణించారు. గుండా మల్లేశ్ కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదు నిమ్స్ లో చికిత్స పొందుతూ ఇవాళ కన్నుమూశారు.

ఆయన భౌతికాయాన్ని అభిమానులు, వామపక్ష కార్యకర్తల సందర్శనార్థం మఖ్దూం భవన్ కు తరలించనున్నారు. ఆపై ఆయన భౌతికకాయాన్ని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి తరలిస్తారు. మల్లేశ్ మృతిపట్ల సీపీఐ అగ్రనేతలు డి.రాజా, నారాయణ విచారం వ్యక్తం చేశారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మరో నేత అజీజ్ పాషా సంతాపం తెలియజేశారు.

 గుండా మల్లేశ్ బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి నాలుగు పర్యాయాలు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయన మృతితో నియోజకవర్గంలో విషాద ఛాయలు అలముకున్నాయి.