Telangana: తెలంగాణ అసెంబ్లీ వద్ద బీజేపీ, సీపీఐ ఆందోళన... ఉద్రిక్తత

  • జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన
  • డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని సీపీఐ ఆందోళన
  • ఉద్యోగాలు ఇవ్వాలంటూ నిరుద్యోగ సంఘాల నేతల నిరసన
rukus at telangana assembly

తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో  జీహెచ్‌ఎంసీ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగాల భర్తీ కోసం అసెంబ్లీ ముట్టడికి బీజేపీ, సీపీఐ, నిరుద్యోగ సంఘాల నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అదుపుచేసే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రిజర్వేషన్లు ఖరారు చేయకుండా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించకూడదంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను అర్హులందరికీ ఇవ్వాలని సీపీఐ నేతలు అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ సంఘాల నేతలు నినాదాలు చేశారు. వారంతా అసెంబ్లీ వద్దకు దూసుకురావడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు‌ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. తమ నేతలను అరెస్టు చేయడం పట్ల బీజేపీ తెలంగాణ నేతలు మండిపడుతున్నారు.

నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ హామీని విస్మరించిందని బీజేపీ తమ ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. కరోనా వేళ ఎల్ఆర్ఎస్ పేరుతో రాష్ట్ర ప్రజలపై అదనపు భారం మోపిందని మండిపడింది. ఎంఐఎం కోసం ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయాలకు టిఆర్ఎస్ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించింది.

More Telugu News