Hatras: బాధితురాలు ధనవంతుల బిడ్డ అయితే ఇలాగే చేస్తారా?: అలహాబాద్ హైకోర్టు సూటి ప్రశ్న

  • రేప్ కేసును సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
  • మేజిస్ట్రేట్ సహా పలువురు అధికారులకు సమన్లు
  • అర్థరాత్రి 2 గంటల సమయంలో అంత్యక్రియలేంటి?
  • కనీస మానవత్వాన్ని చూపించలేదన్న న్యాయస్థానం
UP High Court asks If the Rape Victim is from Rich Family

హత్రాస్ హత్యాచార బాధితురాలి విషయంలో వాదనలు జరుగుతున్న వేళ, అలహాబాద్ హైకోర్టు, ఆర్థిక, కులాల ప్రస్తావన తీసుకుని వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలి అంత్యక్రియలను జరిపించిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ, అర్థరాత్రి 2 గంటల సమయంలో హడావుడిగా మృతదేహాన్ని దహనం చేయడాన్ని ప్రశ్నించింది. బాధితురాలు ధనవంతుల బిడ్డ అయితే, ఇలాగే చేస్తారా? అని పోలీసులను ప్రశ్నించింది.

అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్, ఈ కేసు విచారణను చేపట్టి, పోలీసుల తీరును దుయ్యబట్టగా, స్థానిక పరిస్థితులు, లా అండ్ ఆర్డర్ ను దృష్టిలో పెట్టుకుని తాము ఆ చర్యలు తీసుకున్నామని అధికారులు కోర్టుకు వెల్లడించారు. ఆ బాలిక పేద కుటుంబానికి చెందకుండా, డబ్బున్న వారి ఇంటి అమ్మాయే అయితే, పోలీసులు ఈ కేసును మరో కోణంలో తీసుకుని ఉండేవారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

ఈ కేసును కోర్టు కూడా తీవ్రంగా పరిగణిస్తోందని బాధితురాలి కుటుంబం తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సీమా కుశాహ్వా వెల్లడించారు. ఈ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు అధికారులకు కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి పూట దహన సంస్కారాలకు ఆయన కూడా కారణమేనన్న అభియోగాలు నమోదయ్యాయి.

అక్టోబర్ 1 న కేసును సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం, ఈ విషయంలో పోలీసులు కనీస మానవ హక్కులను, మృతురాలి బంధుమిత్రుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోలేదని, మృతురాలి ఇంట్లో బంధువులు ఉండగా, తాళం వేసి మరీ అంత్యక్రియలు ఎందుకు ముగించారని ప్రశ్నించింది. కడసారి చూపులకు కూడా వారిని దూరంచేయడం మానవత్వం అనిపించుకోదని వ్యాఖ్యానించింది.

More Telugu News