Ramlila: 80 ఏళ్ల తర్వాత తొలిసారి రామ్‌లీలా వేడుకలకు దూరం: రామ్‌లీలా కమిటీ

  • ఎర్రకోట మైదానంలో వేడుకల నిర్వహణకు ఇప్పటి వరకు లభించని అనుమతి
  • మతపరమైన ఏ కార్యక్రమమూ కరోనా వ్యాప్తికి కారణం కాకూడదన్న కమిటీ
  • ఢిల్లీ ప్రభుత్వ నిబంధనలతో వేడుకలు సాధ్యం కాదని స్పష్టీకరణ
Delhis Iconic Ramlila Attended By The PM Wont Be Held This Year

దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మైదానంలో ప్రతి ఏడాది జరిగే రామ్‌లీలా ఉత్సవాలు ఈసారి జరగడం లేదు. కరోనా వైరస్ కారణంగా వేడుకల నిర్వహణకు ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఏ) ఇప్పటి వరకు అనుమతి ఇవ్వలేదని లవ్‌కుశ్ రామ్‌లీలా కమిటీ తెలిపింది.

గత 80 సంవత్సరాలుగా ఈ మైదానంలో వేడుకలు నిర్వహిస్తుండగా, ఈసారి మాత్రం వేడుకల్లేకుండా మైదానం బోసిపోనుంది. ఇక్కడ జరిగే రామ్‌లీలా వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. కాగా, రామ్‌లీలా, దుర్గాపూజ ఉత్సవాలను మాత్రం నిర్వహించుకోవచ్చని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. అయితే, వీటిలోనూ కరోనా నిబంధనలు పాటించడం తప్పనిసరని స్పష్టం చేసింది.

నిజానికి తాము ఉత్సవాలను నిర్వహించాలనే అనుకున్నామని అయితే, ఎర్రకోట మైదానం ఏఎస్ఐ పరిధిలోకి వస్తుండడంతో తమకు ఇప్పటి వరకు అనుమతి లభించలేదని లవ్‌కుశ్ రామ్‌లీలా కమిటీ తెలిపింది. వేడుకల నిర్వహణకు చాలా సమయమే ఉన్నప్పటికీ ఢిల్లీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.

80 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్న ఉత్సవాలు ఈసారి మాత్రం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మతపరమైన ఏ సంఘటన అయినా అది మహమ్మారి వ్యాప్తికి కారణం కాకూడదన్నదే తమ అభిమతమని వివరించింది. రాబోయే రోజుల్లో ఏదైనా అవకాశం లభిస్తే మాత్రం ఒక రోజు వేడుకను నిర్వహిస్తామని కమిటీ స్పష్టం చేసింది.

More Telugu News