ఓ నిందితుడికి పోలీసులు పూలదండతో స్వాగతం పలికారు... కారణం ఇదే!

12-10-2020 Mon 22:03
Police welcomes an accused with a garland
  • ఆరేళ్ల కిందట ఓ వ్యక్తిపై మధ్యప్రదేశ్ లో కేసు నమోదు
  • ఇటీవల శాశ్వత వారెంట్ జారీ చేసిన పోలీసులు
  • సైకిల్ పై 1,400 కిమీ ప్రయాణించి పోలీస్ స్టేషన్ కు వచ్చిన నిందితుడు 

మధ్యప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల కిందట ఓ వ్యక్తిపై కేసు నమోదు కాగా, ఇటీవలే పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆ వ్యక్తికి పోలీసులు అపూర్వ స్వాగతం పలికారు. పూలదండ వేసి ఆహ్వానించారు. అందుకు బలమైన కారణమే ఉంది.

అసలేం జరిగిందంటే.... మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి చెందిన ముకేశ్ కుమార్ పెళ్లి చేసుకున్న తర్వాత బీహార్ లో సెటిలయ్యాడు. 2014లో ముకేశ్ కుమార్ కు, ఓ బంధువుకు మధ్య వివాదం జరిగింది. దీనిపై ఉజ్జయిని నాగ్ ఝురీ పీఎస్ లో పోలీసు కేసు నమోదైంది. పోలీసులు వారెంట్ జారీ చేసినా ముకేశ్ కుమార్ స్పందించలేదు. దాంతో పోలీసులు  బీహార్ లోని అతని చిరునామా తెలుసుకుని శాశ్వత వారెంట్ జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు రావాలని స్పష్టం చేశారు.

పోలీసుల నుంచి వచ్చిన వారెంట్ చూసిన ముకేశ్ కుమార్ ఉజ్జయిని వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ తన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. అయినాగానీ ఓ సైకిల్ పై సుదీర్ఘ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. బీహార్ లోని సీతామడి నుంచి నాగ్ ఝీరి వెళ్లేందుకు బయల్దేరాడు. మధ్యలో ఖర్చుల కోసం అక్కడక్కడా కూలిపనులు చేశాడు. ఆ విధంగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి నాగ్ ఝీరి చేరుకున్నాడు. అందుకు అతనికి 10 రోజుల సమయం పట్టింది.

ఎంతో ప్రయాసతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ముకేశ్ కుమార్ ను చూసి పోలీసులు విస్మయానికి గురయ్యారు. ఆపై పూలదండ తెప్పించి అతడి మెడలో వేసి స్వాగతం పలికారు. వారెంట్ పట్ల అతడి నిబద్ధత, చట్టం పట్ల అతడి గౌరవానికి పోలీసులు ఫిదా అయ్యారు. దీనిపై పోలీసు అధికారి సంజయ్ వర్మ మాట్లాడుతూ, ముకేశ్ ను న్యాయస్థానంలో హాజరుపర్చుతామని, కోర్టు ఏం చెబితే అది అమలు చేస్తామని అన్నారు.