ఏపీలో ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: పవన్ కల్యాణ్

12-10-2020 Mon 20:32
Pawan Kalyan says government postpone Engineering exams
  • కరోనా పరిస్థుతుల్లో పరీక్షలేంటన్న పవన్
  • విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడుతున్నారని వెల్లడి
  • పరీక్షలు నిలుపుదల చేయాలని విజ్ఞప్తి

ఏపీలో ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుండడాన్ని జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో పరీక్షల నిర్వహణపై ఆందోళన నెలకొని ఉందని, ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

కరోనా వ్యాప్తి కారణంగా మార్చి నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయని, ఈ నేపథ్యంలో తమకు సమాచారం అందించకుండా సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించడంపై విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికీ వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలకు వెళ్లేందుకు విద్యార్థులు జంకుతున్నారని, వారి తల్లిదండ్రులు భయపడుతున్నారన్న విషయం జనసేన పార్టీ దృష్టికి వచ్చిందని వివరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా యూజీసీ మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని సెమిస్టర్ పరీక్షల నిర్వహణ నిలుపుదల చేయాలని పవన్ కోరారు.