కంగ్రాట్స్ కవితా... చెల్లికి శుభాభినందనలు తెలిపిన కేటీఆర్

12-10-2020 Mon 20:02
Minister KTR wishes his sister Kalvakuntla Kavitha on her win
  • నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కవిత బంపర్ విక్టరీ
  • తిరుగులేని విజయం అంటూ కేటీఆర్ ట్వీట్
  • టీఆర్ఎస్ శ్రేణులను కొనియాడిన వైనం

గత లోక్ సభ ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా నిర్వహించిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో అద్భుత విజయం అందుకున్నారు. కవిత విజయం కోసం టీఆర్ఎస్ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డాయి. కాగా, తన సోదరి కవిత ఎమ్మెల్సీగా నెగ్గడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. మెనీ కంగ్రాచ్యులేషన్స్ కవితా అంటూ ట్వీట్ చేశారు. తిరుగులేని విజయం సాధించావంటూ చెల్లిని అభినందించారు.

కవిత విజయానికి కృషి చేసిన నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణులను మెచ్చుకున్నారు. టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా విభాగాన్ని ఈ ఎన్నికల కోసం సమర్థవంతంగా నడిపించారంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఎంతో సమన్వయంతో పాటుపడ్డారని కొనియాడారు.