కరోనా వైరస్ వ్యాప్తిపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెల్లడి

12-10-2020 Mon 19:40
Australian researchers says corona virus can live more in cold conditions
  • ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా
  • చల్లటి వాతావరణంలో కరోనా నియంత్రణ కష్టమన్న శాస్త్రవేత్తలు
  • కరోనా ఎక్కువగా నేరుగానే సోకుతుందని వెల్లడి

చైనాలో గతేడాది చివర్లో ప్రతాపం చూపిన కరోనా వైరస్ 2020 ఆరంభం నుంచి ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తోంది. ఈ రాకాసి వైరస్ పై ఆస్ట్రేలియాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ ప్రెపేర్డ్ నెస్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా సైంటిస్టులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు.

వేసవికాలం కంటే శీతాకాలంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. ప్లాస్టిక్ వస్తువులు, కరెన్సీ నోట్లు, మొబైల్ ఫోన్లపై 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కరోనా వైరస్ ఒక్కరోజు కన్నా తక్కువ సమయం మాత్రమే జీవిస్తుందని, కానీ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 28 రోజుల పాటు మనుగడ సాగించగలదని గుర్తించారు. చల్లటి వాతావరణంలో కరోనాను కట్టడి చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. వేడిగా ఉండే ప్రదేశాల కంటే చల్లగా ఉండే ప్రదేశాల్లో కరోనా జీవనకాలం 7 రెట్లు ఎక్కువగా ఉంటోందని పేర్కొన్నారు.

అంతేకాదు, కరోనా వైరస్ సంక్రమణం ఎక్కువగా నేరుగానే జరుగుతోందని, కరోనా రోగి మాట్లాడినప్పుడు గాలిలోకి వ్యాప్తి చెందే కణాల ద్వారానే ఎదుటి వ్యక్తికి కరోనా సోకుతుందని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలిపారు.