కొత్త వ్యవసాయ చట్టాలపై కేంద్రానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు

12-10-2020 Mon 19:36
Supreme Court issues notice to centre over new farm acts
  • కొత్త వ్యవసాయ చట్టాలపై సుప్రీంలో దాఖలైన పిటిషన్లు
  • మార్కెట్ కమిటీల వ్యవస్థ కూలిపోతుందన్న పిటిషనర్లు
  • నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టాలతో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని విపక్షాలు మండిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 మరోవైపు, ఈ చట్టాలతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కేంద్రం చెపుతోంది. ఈ చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ చట్టాల వల్ల వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను కల్పించే వ్యవసాయ మార్కెట్ కమిటీల వ్యవస్థ కుప్పకూలుతుందని పిటిషనర్లు ఆందోళన వెలిబుచ్చారు.

ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది.