వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగిద్దామనుకుంటున్నా: వెంకయ్యనాయుడు

12-10-2020 Mon 18:46
Venkaiah Naidu says he has cured from corona very well
  • వెంకయ్యనాయుడుకు కరోనా నెగెటివ్
  • పూర్తిగా కోలుకున్నట్టు వెంకయ్య వెల్లడి
  • తన కోసం ప్రార్థించిన వారికి కృతజ్ఞతలు తెలిపిన వెంకయ్య

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల కరోనా బారినపడ్డారు. తాజాగా తనకు కరోనా నయం అయిందని, ఇవాళ ఎయిమ్స్ బృందం నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని వెంకయ్యనాయుడు స్వయంగా వెల్లడించారు. కరోనా సంక్రమణ కారణంగా వైద్యుల సూచనమేరకు హోంఐసోలేషన్ లో ఉన్నానని, ఇప్పుడది పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ వైద్యులు సూచించిన జాగ్రత్తలు మరికొంతకాలం కొనసాగించడం మంచిదని భావిస్తున్నానని వెంకయ్య ట్విట్టర్ లో పేర్కొన్నారు.

"స్వీయ నిర్బంధంలో ఉన్న సమయంలో ఎంతోమంది నా ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. నేను ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ప్రాంతాలకు, పార్టీలకు, మతాలకు అతీతంగా ప్రార్థనలు చేశారు. వారి ప్రేమాభినాలకు ధన్యవాదాలు. కరోనా సంక్రమణ సమయంలో నాకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించిన వైద్యసిబ్బందికి కృతజ్ఞతలు. నాకు తోడుగా అన్నివేళలా సేవలు అందించిన నా వ్యక్తిగత సహాయకులకు ధన్యవాదాలు" అంటూ స్పందించారు.