Bollywood: బాలీవుడ్ పరువు తీశాయంటూ.. రెండు జాతీయ ఛానళ్లపై హిందీ సినీ ప్రముఖుల దావా!

  • బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారంపై చానళ్ల కథనాలు
  • బాధ్యతారాహిత్యంగా కథనాలు ప్రసారం చేశారంటూ దావా
  • నీచమైన పదాలను ఉపయోగించారని ఆరోపణ
Bollywood biggies files lawsuit against two channels

సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం మరోసారి వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణకు హాజరయ్యారు. మరోవైపు బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. బాలీవుడ్ లో నీచ సంస్కృతి నెలకొందనే విధంగా కథనాలను ప్రసారం చేశారు. ఈ నేపథ్యంలో రెండు ప్రముఖ జాతీయ ఛానళ్లైన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌలపై ఢిల్లీ హైకోర్టులో బాలీవుడ్ ప్రముఖులు దావా వేశారు.

బాధ్యతారాహిత్యంగా కథనాలను ప్రసారం చేశారంటూ బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్, కరణ్ జొహార్, ఆదిత్య చోప్రా, ఫర్హాన్ అఖ్తర్, తదితరులతో పాటు పలు నిర్మాణ సంస్థలు ఈ రెండు చానళ్లపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ గౌరవాన్ని, ప్రతిష్టను మంటకలిపేలా నీచమైన పదాలను వాడారంటూ తమ లీగల్ సూట్ లో పేర్కొన్నారు.

ఇప్పటికే టీఆర్పీ ట్యాంపరింగ్ కు రిపబ్లిక్ టీవీ పాల్పడుతోందంటూ ముంబై పోలీసులు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బాలీవుడ్ ప్రముఖులు లాసూట్ వేయడం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు.

More Telugu News