ఏపీలో ఇటీవల కాలంలో ఇవే అతి తక్కువ కేసులు... కృష్ణా జిల్లాలో రెండంకెల సంఖ్యకు దిగొచ్చిన కొత్త కేసులు

12-10-2020 Mon 18:32
AP witnesses lowest corona cases in recent times
  • రాష్ట్రంలో శాంతిస్తున్న కరోనా
  • గత 24 గంటల్లో 61,112 శాంపిళ్ల పరీక్ష
  • 3,224 పాజిటివ్ కేసులు వెల్లడి
  • కృష్ణా జిల్లాలో 86 కొత్త కేసులు

ఏపీలో కరోనా రక్కసి తీవ్రత క్రమంగా తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజా గణాంకాలే అందుకు నిదర్శనం. గడచిన 24 గంటల్లో ఏపీలో 61,112 శాంపిళ్లు పరీక్షించగా, 3,224 మందికి పాజిటివ్ అని తేలింది. ఇటీవల కాలంలో ఇవే ఒక్కరోజులో నమోదైన అతి తక్కువ కేసులు. కొన్నివారాల కిందట 10 వేల వరకు పాజిటివ్ కేసులు రాగా, ఇటీవల అది 5 వేల వరకు వచ్చింది. ఇప్పుడు తాజాగా 3 వేలకు దిగింది.

అంతేకాదు, కొన్ని నెలల తర్వాత ఓ జిల్లాలో కొత్త కేసుల సంఖ్య తొలిసారిగా రెండంకెల సంఖ్యకు పడిపోయింది. కృష్ణా జిల్లాలో తాజాగా కేవలం 86 పాజిటివ్ కేసులు వచ్చాయి. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 547 కేసులు గుర్తించారు. ఇక తాజా బులెటిన్ లో ఇతర వివరాలు పరిశీలిస్తే... ఏపీలో 32 మంది కరోనాతో మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 6,256కి పెరిగింది. రాష్ట్రంలో మరో 5,504 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఓవరాల్ గా ఇప్పటివరకు ఏపీలో 7,58,951 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,08,712 మందికి కరోనా నయం అయింది. ఇంకా, 43,983 మంది చికిత్స పొందుతున్నారు.