బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూ

12-10-2020 Mon 14:35
Actress turned politician Khushboo joins BJP
  • ఢిల్లీలో పార్టీ ప్రముఖుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న నటి
  • ఈ ఉదయం కాంగ్రెస్ కు రాజీనామా
  • సోనియా గాంధీకి లేఖ

ప్రముఖ దక్షిణాది నటి ఖుష్బూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. ఈ ఉదయం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆమె మధ్యాహ్నానికి కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖుల సమక్షంలో కమలదళంలో ప్రవేశించారు. కుష్బూ ఈ ఉదయం కాంగ్రెస్ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను పంపారు.

పార్టీ కోసం పనిచేసే తనవంటి వాళ్లను పార్టీలో ఉన్నతస్థాయిలో ఉన్న కొన్ని శక్తులు అణచివేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాబాహుళ్యంలో ఎలాంటి గుర్తింపు లేని ఆ నేతలకు క్షేత్రస్థాయి పార్టీ శ్రేణులతో సంబంధాలు కూడా ఉండవని, కానీ వారు తన వంటి కష్టపడే వారిని ఎదగనివ్వరని ఖుష్బూ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సుదీర్ఘంగా ఆలోచించి ఇక పార్టీ నుంచి తప్పుకుంటేనే మేలన్న నిర్ణయానికి వచ్చానని, అందుకే రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు.

తమిళనాడు సినీ అభిమానులతో గుడి కట్టించుకున్న తొలి అందాల హీరోయిన్ ఖుష్బూనే. ఆమె 2010లో రాజకీయాల్లో ప్రవేశించారు. తొలుత డీఎంకేలో చేరారు. ఎంకే స్టాలిన్ తో పొసగకపోవడంతో డీఎంకే నుంచి వైదొలగి 2014లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, 2019 లోక్ సభ ఎన్నికల్లో తనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఖుష్బూ అసంతృప్తికి గురయ్యారని, 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు బీజేపీ హామీ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.