అంధకారంలో ముంబై నగరం... ఆగిపోయిన రైళ్లు, పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్!

12-10-2020 Mon 11:36
Mumbai in Power Crises
  • చుట్టుముట్టిన కరెంట్ కష్టం
  • ఫెయిల్ అయిన టాటా పవర్
  • ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని కరెంటు కష్టాలు చుట్టుకున్నాయి. నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరానికి విద్యుత్ ను అందించే టాటా ఇన్ కమింగ్ ఎలక్ట్రిక్ సరఫరా వ్యవస్థ విఫలం కావడంతో సమస్య మొదలైంది.ఫలితంగా ఎన్నో ప్రాంతాల్లో కరెంట్ పోయింది. దీంతో సబర్బన్ రైళ్లు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. రహదారుల జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక పోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది.

దీంతో ప్రజలు ఈ ఉదయం నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముంబైకి విద్యుత్ ను అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన టాటా పవర్ విఫలం కావడమే సమస్యకు కారణమని పశ్చిమ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పవర్ ఫెయిల్యూర్ ఇదేనని, ఈ ఉదయం 10.05కు సమస్య మొదలైందని, మరికాసేపట్లో సమస్య పరిష్కారం కావచ్చని అధికారులు వెల్లడించారు.

ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా సమస్య ఏర్పడిందని, ఎన్నో విభాగాలు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలోనే రైళ్లు తిరిగి నడుస్తాయని, ప్రజలు సమస్యను అర్థం చేసుకోవాలని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.

ఇదిలావుండగా, టాటాల తరువాత ముంబైకి అత్యధిక విద్యుత్ ను సరఫరా చేస్తున్న అదానీ ఎలక్ట్రిసిటీ స్పందించింది. ప్రస్తుతం అత్యవసర విభాగాలకు కరెంటు సరఫరాను తాము పునరుద్ధరించామని, ప్రజలు సహనంతో ఉండాలని కోరింది. కాగా, విద్యుత్ నిలిచిపోగానే, వేలాది మంది సామాజిక మాధ్యమాల్లో తమ కామెంట్లు పెట్టారు. ప్రభుత్వం విఫలమైందని, ఆర్థిక రాజధానిలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎవరి ఇంట్లోనైనా కరెంట్ ఉందా? అని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.