ధోనీ కూతురిపై అసభ్య వ్యాఖ్యలపై మండిపడ్డ యాంకర్ అనసూయ

12-10-2020 Mon 11:16
anu says many of us sometimes MS Dhonis Daughter
  • ఇటువంటివి నాకూ ప్రతిరోజు ఎదురవుతున్నాయి 
  • ఆన్ లైన్ లో అసభ్యకరంగా పోస్టులు చేసే వారిని కట్టడి చేయాలి
  • ఇంకా మెరుగైన, కఠిన నిబంధనలు ఉండాలి

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీ కుమార్తె జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన 16 ఏళ్ల బాలుడిని గుజరాత్ లోని ముంద్రా ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన అనంతరం తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో బాలుడు ఆ పోస్ట్ చేశాడు. సామాజిక మాధ్యమాల్లో బెదిరింపు ధోరణితో పోస్టులు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడం పట్ల సినీనటుడు మాధవన్ పోలీసులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇంటర్నెట్ లో తమకు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేసుకోవచ్చని భావించే ఇటువంటి వారిని కట్టడి చేయాలంటూ ఆయన ట్వీట్ చేశాడు.

దీనిపై యాంకర్ అనసూయ స్పందించింది. మాధవన్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ... ‘ఇటువంటివి నాకూ ప్రతిరోజు ఎదురవుతున్నాయి సర్.. ఆన్ లైన్ లో అసభ్యకరంగా పోస్టులు చేసే వారిని కట్టడి చేయడానికి ఇంకా మెరుగైన, కఠిన నిబంధనలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి పోస్టులు చాలా సమయాల్లో నాతో పాటు చాలా మందిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి ఘటనలు ఎదురైనప్పుడు నిస్సహాయంగా ఉంటే ఎలా? ఇలాంటి ఘటనలపై విచారం వ్యక్తం చేయడం కన్నా, ఇటువంటి వాటిని కట్టడి చేసే చర్యలే ఉపయోగపడతాయి కదా?’ అని అనసూయ పేర్కొంది.