ప్రజల కోసం ఒకటి కన్నా ఎక్కువ వ్యాక్సిన్ లను ఎంపిక చేయనున్న కేంద్రం!

12-10-2020 Mon 10:40
More than One Vaccine for India
  • మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందాలు
  • తొలి దశలో స్వల్ప మోతాదుల్లోనే వ్యాక్సిన్
  • వ్యాక్సిన్ సురక్షితమని తేలితేనే విడుదల
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ 

దేశంలోని ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఇచ్చేందుకు ఒకటి కన్నా ఎక్కువ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్, ఓ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, భారీ ఎత్తున తయారీ మొదలవుతుందని, ఆపై మరో వ్యాక్సిన్ ను కూడా ఎంపిక చేస్తామని తెలిపారు. కరోనా సోకే ప్రమాదం అధికంగా ఉందని భావించిన గ్రూపులకు తొలుత వ్యాక్సిన్ ను అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

"ఇండియాలో భారీ సంఖ్యలో ఉన్న జనాభాను దృష్టిలో పెట్టుకుని, ఒక వ్యాక్సిన్ సరిపోదన్న నిర్ణయానికి వచ్చాం. మన డిమాండ్ ను కేవలం ఒక్క కంపెనీ మాత్రమే తీర్చే పరిస్థితి లేదు. అందువల్ల మరికొన్ని రకాలనూ అందుబాటులోకి తెస్తాం. అప్పుడే సాధ్యమైనంత త్వరగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వవచ్చు" అని ఆయన అన్నారు.

కాగా, ప్రస్తుతం ఇండియాలో అన్ని వ్యాక్సిన్లూ, ఒకటి నుంచి మూడవ దశ ప్రయోగాల మధ్య ఉన్నాయి. వీటి ఫలితాలు వెల్లడికావాల్సి వుంది. ఈ వ్యాక్సిన్ల నుంచి ప్రజలకు లభించే రక్షణ, వాటి పనితీరు, శరీరంలో ప్రభావం నిలిచే సమయం తదితరాలపై మరింత స్పష్టత వెలువడాల్సి వుంది. ఏదైనా వ్యాక్సిన్ పూర్తి సురక్షితమని తేలితే, అత్యవసర వినియోగానికి దాన్ని అనుమతించే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిస్తోందని హర్షవర్ధన్ వెల్లడించారు.

తొలి దశలో వ్యాక్సిన్ ను స్వల్ప మోతాదుల్లోనే ఇస్తామని, ఇదే సమయంలో వ్యాక్సిన్ నిర్వహణ చాలా ముఖ్యమన్న విషయం తమకు తెలుసునని వ్యాఖ్యానించిన ఆయన, తమ పరిశీలనలో ఎన్నో వ్యాక్సిన్లు ఉన్నాయని, వాటిల్లో కొన్ని వ్యాక్సిన్లు, కొన్ని వయస్సులలో ఉన్న గ్రూపుల వారికి మాత్రమే సూటబుల్ అవుతాయని హర్షవర్ధన్ పేర్కొన్నారు. సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ పరిశీలిస్తున్న వ్యాక్సిన్లు రెండు డోస్ ల వ్యాక్సిన్లని, కాడిలా వ్యాక్సిన్ త్రీ డోస్ వ్యాక్సిన్ అని ఆయన తెలిపారు.

ఇదిలావుండగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెబ్ సైట్ లో ఉన్న వివరాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో 100కు పైగా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. సురక్షితంగా, మెరుగైన పనితీరును అందించే వ్యాక్సిన్ కోసం సైంటిస్టులు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.