ఈ తప్పుకు బాధ్యత నాదే... ఇకపై ఇలా జరుగదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

12-10-2020 Mon 10:00
Gorantla Agrees his Mistake on Social Media
  • ఇటీవల ఏపీ రహదారులపై వీడియో
  • అది తెలంగాణలోనిదని తేల్చిన నెటిజన్లు
  • ఇకపై జాగ్రత్తగా ఉంటానన్న గోరంట్ల

ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందంటూ, తెలుగుదేశం పార్టీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వీడియో ఏపీది కాదని, అవి తెలంగాణలోని రహదారులని నెటిజన్లు తేల్చారు. దీనిపై తాజాగా స్పందించిన గోరంట్ల, పొరపాటు జరిగిందని, దానికి తనదే బాధ్యతని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు చేశారు.

"గమనిక: మొన్న ఒక పొరపాటు జరిగింది. పిఠాపురం నుండి సామర్లకోట రోడ్డు పరిస్థితి అని ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. కానీ అది తెలంగాణ ప్రాంతంలో జరిగినదిగా తెలిసింది. దీనికి నేను బాధ్యత వహిస్తున్నాను. ఇక నుండి ఇలాంటివి జరగవు" అని ఆయన అన్నారు.

ఆపై, "మా టీమ్ నుండి ఈ పొరపాటుకి కారణమైన వ్యక్తిని కూడా తొలగించడం జరిగింది. తప్పుని తప్పుగా చెప్పే సోషల్ మీడియా మిత్రులు అందరికీ నా ధన్యవాదాలు" అని గోరంట్ల తెలిపారు.