నేడు బీజేపీలోకి నటి ఖుష్బూ .. ఢిల్లీకి పయనం!

12-10-2020 Mon 06:54
Actor turned Politician Khushboo may join in BJP today
  • గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరం
  • మరో ఎనిమిది నెలల్లో తమిళనాడులో ఎన్నికలు
  • ఖుష్బూను బరిలోకి దింపే యోచనలో బీజేపీ!

తమిళనాడుకు చెందిన ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు ఖుష్బూ సుందర్ నేడు బీజేపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న ఆమె కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని సమర్థించారు. దీంతో అధిష్ఠానం ఆమెపై గుర్రుగా ఉంది. అయితే, అది తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని ఆ తర్వాత చెప్పుకొచ్చారు. మరోపక్క, 2014 నుంచి కాంగ్రెస్‌లో కొనసాగుతున్న ఖుష్బూ గత కొన్ని నెలలుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఖుష్బూ బీజేపీలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తల నడుమ నిన్న ఆమె ఢిల్లీకి బయలుదేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై విలేకరుల ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. ఈ విషయంపై వ్యాఖ్యానించడం తనకు ఇష్టం లేదని, కాబట్టి ఏమీ చెప్పాలనుకోవడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో ఆమె గ్రాఫ్ కూడా అంత బాగాలేదు. దీంతో బీజేపీలో చేరేందుకే ఆమె మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు, తమిళనాడులో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ, మరో 8 నెలల్లో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖుష్బూను బరిలోకి దింపాలని యోచిస్తోంది. పాప్యులర్ స్టార్ అయిన కుష్బూ కాంగ్రెస్‌లో చేరకముందు అంటే 2010లో డీఎంకేలో చేరారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తను సరైన నిర్ణయమే తీసుకున్నట్టు చెప్పారు. మహిళల మంచి కోసం తాను పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే, నాలుగేళ్ల తర్వాత డీఎంకేకు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో సుందర్‌నగర్ టికెట్ ఆశించినప్పటికీ ఆమెకు అది దక్కలేదు.