ఐపీఎల్‌లో కొనసాగుతున్న ముంబై ఆధిపత్యం.. ఢిల్లీపై గెలుపు

12-10-2020 Mon 06:27
Mumbai Indian won against Delhi capitals
  • ఐదు వికెట్ల తేడాతో ఢిల్లీ కేపిటల్స్‌పై విజయం
  • అగ్రస్థానంలోకి రోహిత్ సేన
  • డికాక్‌కు మ్యాన్ ఆఫ్  ద మ్యాచ్ అవార్డు

ఐపీఎల్ 2020లో ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది. గత రాత్రి ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలిచి అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఢిల్లీ కేపిటల్స్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 2 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కెప్టెన్ రోహిత్‌శర్మ (5) విఫలమైనా క్వింటన్ డికాక్ (53, 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (53, 32 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇషాన్ కిషన్ (28), కీరన్ పొలార్డ్ (11), కృనాల్ పాండ్యా (12) పరుగులు చేసి  జట్టును విజయ తీరాలకు చేర్చారు. ముంబైకి ఇది వరుసగా నాలుగో గెలుపు. ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ముంబై 5 విజయాలతో అగ్రస్థానానికి చేరుకుంది.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 24 పరుగులకే పృథ్వీషా (4), రహానే (15) వికెట్లను కోల్పోయింది. దీంతో జట్టు భారాన్ని తనపై వేసుకున్న ధవన్ ఆటను నిలబెట్టాడు. అయితే,  చివరి వరకు క్రీజులో ఉన్నప్పటికీ జోరుగా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 69 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కొంత దూకుడుగా ఆడాడు. 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు చేయడంతో ఢిల్లీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. స్లోయినిస్ 13, అలెక్స్ కేరీ 14 పరుగులు చేశారు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన డికాక్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.