Corona Virus: ఫిబ్రవరిలో అలా... సెప్టెంబరు నాటికి ఇలా... డాక్టర్ల కోణంలో కరోనా పరిస్థితి!

  • ఫిబ్రవరి నాటికి ప్రపంచంలో పాకిపోయిన కరోనా
  • మొదట్లో విపరీతంగా మరణాలు
  • ఎక్కడికక్కడ కుప్పకూలిపోయి చనిపోయిన రోగులు
  • ఇప్పుడు అనేక చికిత్స పద్ధతులు తెలుసుకున్న వైద్యులు
corona treatment now and then

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పటికీ ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. పేద, ధనిక దేశాలన్న తేడా లేకుండా మానవాళిని పట్టిపీడిస్తోంది. భారత్ లో ఈ రాకాసి వైరస్ వ్యాప్తి జనవరి చివరి వారంలో మొదలైంది. ఫిబ్రవరి నాటికే ఇది ప్రపంచంలోని అనేక దేశాలపై పంజా విసిరింది. ముఖ్యంగా ఇటలీ, అమెరికా, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల్లో మృత్యుఘంటికలు మోగాయి.

వాస్తవానికి ఇదికొత్త వైరస్. వ్యాధి లక్షణాలను బట్టి చికిత్స చేయడం తప్ప, ఈ వైరస్ కు వ్యాక్సిన్ కానీ, ప్రత్యేకించి మందులు కానీ లేవు. దాంతో వ్యాధి లక్షణాల తీవ్రతను అంచనా వేసే లోపే ప్రాణాలమీదికి వచ్చేది. ఆ విధంగా ఎందరో మరణించారు. ఈ మృత్యు వైరస్ గురించి ఫిబ్రవరి నాటికి డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు తెలిసింది చాలా తక్కువ.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా గురించి ఎన్నో విషయాలు బోధపడ్డాయి. దాని గుట్టుమట్లన్నీ ఇంచుమించుగా పరిశోధకులు గుర్తించారు. దాని ఫలితమే సెప్టెంబరు నాటికి కరోనా ప్రభావం సగానికి సగం తగ్గింది. ప్రధానంగా మరణాల రేటు ఆందోళన కలిగించే స్థాయి నుంచి సాధారణ స్థాయికి దిగింది. అందుకు 5 కారణాలు ఉన్నాయని డాక్టర్లు, శాస్త్రవేత్తలు అంటున్నారు.

  • తొలి నాళ్లలో కరోనా అనగానే ఊపిరితిత్తుల్లో నెమ్ము అనే భావించారు. నెమ్ము ఎక్కువై శ్వాస ఇబ్బందులు ఏర్పడితే వెంటిలేటర్లు అమర్చితే సరిపోతుందనుకున్నారు. కానీ కరోనా వైరస్ ఊపిరితిత్తుల రక్తనాళాల్లోనూ, ఇతర రక్తనాళాల్లోనూ రక్తం గడ్డ కట్టేందుకు కారణమవుతుందని, తద్వారా శరీరంలో ఆక్సిజన్ లభ్యత తగ్గడానికి కారణమవుతుందని ఇప్పుడు తెలుసుకున్నారు. వెంటిలేటర్ల ద్వారా ఊపిరితిత్తులకు అవసరమైన ఆక్సిజన్ అందించగలరేమో కానీ, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తం గడ్డకట్టడాన్ని అడ్డుకోలేమని అర్థమైంది. అందుకే ప్రస్తుతం కరోనా చికిత్సలో ఆస్ప్రిన్, హెపారిన్ వంటి రక్తం పలుచన చేసే మందులను వినియోగిస్తున్నారు. ఈ మందులను కరోనా ప్రోటోకాల్ లోనూ చేర్చారు. తద్వారా కరోనా చికిత్సలో కీలక పురోగతి సాధ్యమైంది. ఫిబ్రవరి సమయంలో ఈ పరిస్థితి లేదు.

  • మొదట్లో కరోనా రోగులు ఎక్కడివాళ్లు అక్కడే పడిపోయి చనిపోయిన ఘటనలు సంభవించాయి. రోడ్లపైనా, ఆసుపత్రి గేట్ల వద్ద కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. అందుకు కారణం వారి శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడమే. ఎలాంటి లక్షణాలు లేకపోయినా హ్యాపీ హైపోక్సియా పరిస్థితి కారణంగా ఆక్సిజన్ లభ్యత 90 శాతం కంటే తక్కువకు పడిపోయేది. కొన్నిసార్లు అది 70 శాతం కంటే తక్కువగా నమోదయ్యేది. ఫిబ్రవరి సమయంలో ఈ శ్వాస సంబంధ ఇబ్బందులను గుర్తించేసరికి పెద్ద సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు హ్యాపీ హైపోక్సియా గురించి తెలిసిపోయింది. కరోనా రోగులందరికీ తప్పనిసరిగా ఆక్సిజన్ చెక్ చేస్తున్నారు. ఇళ్ల వద్ద కూడా ఆక్సిజన్ చెక్ చేసుకునేందుకు నేడు పల్స్ ఆక్సీమీటర్లు అందుబాటులోకి వచ్చాయి.

  • ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఔషధాలు. ఫిబ్రవరిలో ఈ మహమ్మారి వైరస్ ను ఎదుర్కొనే శక్తిమంతమైన మందులు లేవు. హైపోక్సియా, ఇతర లక్షణాలకే వైద్యం చేసేవాళ్లు. దాంతో చాలామంది రోగుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రస్థాయికి చేరేది. కానీ సెప్టెంబరు నాటికి రెండు ప్రాణాధార మందులు అందుబాటులోకి వచ్చాయి. అవి ఫావిపిరావిర్, రెమ్ డెసివిర్. ఈ రెండు యాంటీ వైరల్ డ్రగ్స్ కరోనా వైరస్ ను చంపగలవు. రోగులు హైపోక్సియా పరిస్థితిలోకి జారిపోకుండా, తీవ్ర ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడడంలో ఈ రెండు ఔషధాలు కీలకం.

  • చాలామంది కరోనా వైరస్ కారణంగా మృతి చెందలేదు. సొంత వ్యాధి నిరోధక శక్తి ప్రమాదకర రీతిలో స్పందించడం వల్ల కూడా అనేకమంది కరోనా పేషెంట్లు మృత్యువాత పడ్డారు. సొంత వ్యాధినిరోధక శక్తి విపరీత స్వభావాన్ని కనబర్చడాన్ని సైటోకైన్ స్టార్మ్ అంటారు. ఓ ఉద్ధృతిలో వైరస్ పై విరుచుకుపడే వ్యాధి నిరోధక శక్తి కొన్ని సందర్భాల్లో రోగులను కూడా చంపేస్తుంది. ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఫిబ్రవరిలో డాక్టర్లకు తెలియలేదు. అయితే అనుభవపూర్వకంగా వచ్చిన జ్ఞానంతో సెప్టెంబరు నాటికి పరిష్కారం కనుగొన్నారు. ఎంతో సులభంగా, విరివిగా లభ్యమయ్యే స్టెరాయిడ్లతో ఈ పరిస్థితిని నివారిస్తున్నారు. 80 ఏళ్లుగా ఈ తరహా చికిత్సను వైద్యులు అవలంబిస్తూనే ఉన్నా, కరోనా విషయంలోనూ దీన్ని పాటించవచ్చని సెప్టెంబరు నాటికి తెలుసుకున్నారు.

  • మొదట్లో హైపోక్సియాకు గురైన కరోనా రోగులను మెరుగైన శ్వాస కోసం బోర్లా పడుకోబెట్టేవాళ్లు. అయితే ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ఇటీవలే అద్భుతమైన విషయం కనుగొన్నారు. కరోనా రోగుల్లోని తెల్ల రక్తకణాలు ఆల్ఫా డెఫిన్సిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తున్నాయని, ఈ రసాయనం కారణంగానే ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతున్నట్టు గుర్తించారు. సమస్యకు మూలకారణం ఏంటో తెలిశాక దీనికి చికిత్స చాలా సింపుల్ అని అర్థమైంది. ప్రస్తుతం కోల్చిసిన్ అనే ఔషధాన్ని వాడుతున్నారు. ఇది అనేక దశాబ్దాలుగా గౌట్ వ్యాధికి చికిత్సలో ఉపయోగిస్తున్న ఔషధమే.

More Telugu News