Farooq Abdullah: సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలకు కారణం ఆర్టికల్ 370 రద్దు చేయడమే: ఫరూక్ అబ్దుల్లా

  • జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసిన కేంద్రం
  • తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫరూక్ అబ్దుల్లా
  • ఆర్టికల్ 370 రద్దును చైనా అంగీకరించదంటూ వ్యాఖ్యలు
Farooq Abdullah comments on China activities at LAC

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లడఖ్ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుందుడుకు చర్యలకు కారణం కేంద్రం కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేయడమేనని అన్నారు. ఈ ప్రాంతంలో ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని చైనా ఎప్పటికీ అంగీకరించదని వ్యాఖ్యానించారు. చైనా మద్దతుతో జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు నోచుకుంటుందని ఆశాభావంతో ఉన్నట్టు వెల్లడించారు.

"ఇప్పుడు వాస్తవాధీన రేఖ వద్ద చైనా ఏంచేస్తున్నా గానీ దానికంతటికీ కారణం ఆర్టికల్ 370 రద్దు వ్యవహారమే. నేనెప్పుడూ చైనా అధ్యక్షుడ్ని భారత్ కు పిలవలేదే. ఆయన్ను ఆహ్వానించింది ప్రధాని మోదీయే. పిలవడమే కాదు ఆయనతో కలిసి ఉయ్యాల ఊగారు. చెన్నై తీసుకెళ్లి విందులు చేసుకున్నారు" అంటూ వ్యాఖ్యానించారు.

ఏదేమైనా 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం చేసిన పని ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంపై తన అభిప్రాయాన్ని ఫరూక్ అబ్దుల్లా కుండబద్దలు కొట్టారు. జమ్మూ కశ్మీర్ సమస్యలపై పార్లమెంటులో మాట్లాడేందుకు కూడా తనకు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.

More Telugu News