Sunrisers: సన్ రైజర్స్ కు భంగపాటు... సిక్స్ తో మ్యాచ్ గెలిపించిన రాజస్థాన్ ఆటగాడు పరాగ్

  • దుబాయ్ లో ఆసక్తికరంగా సన్ రైజర్స్, రాజస్థాన్ మ్యాచ్
  • 5 వికెట్ల తేడాతో గెలిచిన రాజస్థాన్ రాయల్స్
  • మరో మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
Sunrisers lost to Rajasthan Royals in Dubai

ఐపీఎల్ లో ఇవాళ ఆసక్తికర సమరం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు భంగపాటు తప్పలేదు. చివరి ఓవర్ వరకు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు 5 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ ను ఓడించింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు కావాల్సి ఉండగా, ఆ ఓవర్ ఐదో బంతికి పరాగ్ సిక్స్ కొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ విజయం ఖాయమైంది.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో రాజస్థాన్ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఆటగాళ్లు క్యాచ్ లు వదలడం రాయల్స్ కు లాభించింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న పరాగ్, తెవాటియా భారీ షాట్లతో సన్ రైజర్స్ అవకాశాలకు తెరదించారు. పరాగ్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేయగా, తెవాటియా 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 45 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ లో ఇవాళ రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బ్యాటింగ్ కే మొగ్గు చూపింది. ఈ మ్యాచ్ కు అబుదాబిలో షేక్ జాయెద్ స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఢిల్లీ జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ కేరీ వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. హెట్మెయర్ స్థానంలో రహానే ఆడే అవకాశాలున్నాయి. ముంబయి జట్టులో ఎలాంటి మార్పులు లేవు.

More Telugu News