హైదరాబాదులో బీభత్సం సృష్టించిన ఫెరారీ కారు... ఒకరి మృతి

11-10-2020 Sun 18:11
Over speeding Ferari sports car hits man
  • అతివేగంతో ప్రమాదానికి కారణమైన స్పోర్ట్స్ కారు
  • వాచ్ మన్ ఏసు మృతి
  • డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాదులో స్పోర్ట్స్ కారు బీభత్సం ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ వెళుతున్న ఓ ఫెరారీ కారు అదుపుతప్పింది. మితిమీరిన వేగంతో దూసుకెళుతున్న కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి డివైడర్ ను ఢీకొట్టింది. ఆపై పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కారు కూడా పాక్షికంగా దెబ్బతింది.

రోడ్డుమధ్యలో కారు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కాగా, ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తిని వాచ్ మన్ ఏసుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.